Wednesday, June 9, 2010

కలదాటి నిజమవ్వవా...

నిదురరాని కునుకా నువు
నిదురదాటి కలవా నువు
కనుసీమనే కలలేలెనే

కలల వెనుక మనిషా నువు
కవిత వెనుక మనసా నువు
తేలేదిక ఏనాటికో 

నిన్నల్లో మొన్నల్లో వున్నావ
నిజమన్న దొంతరలో దాగావా
కలదాటి నిజమవ్వవా…

Saturday, June 5, 2010

హరివిల్లు

గుడిమెట్టు ఏటిగట్టు
తాటిచెట్టు తేనెపట్టు
కంచిపట్టు పంచెకట్టు
జానపదుల బాణికట్టు

గుజ్జనగూళ్ళు రేగిపళ్ళు
గుడిగంటలు భోగిమంటలు
తిరునాళ్ళు పాడిపంటలు
తిరుగళ్ళు పిండివంటలు

పల్లెటూళ్ళ అందచందం
భావకవుల ఆసుకవితం
అచ్చతెనుగు నుడికారం
మరచినాము గ్రహచారం

మనసుతెరలు తెరిచి చూడు
అసలుమనసు తరచి చూడు
మనసిచ్చిన పాటపాడు
వయసు మరచి ఆటలాడు

ఆ నింగిలో నాడు విరియును చూడు
మన ఆశల రంగులు ఏడు!---హరివిల్లు

Friday, June 4, 2010

ఇక నేను ఓ బహువచనం

జనవనంలో యినుప పువ్వులు
నవ్వి విషపుతేనె చిమ్మితే 
జల్లెడై నా మనసుపడవ ప్రాణాన్ని చినికింది

సొమ్మసిల్లిన ప్రాణం ఆత్మని పానంచేస్తే
దేహానికి జీవమొచ్చి నేను ఒంటరినికానని మనసు బొబ్బలు పెట్టింది
నాకు నేనే నేస్తాన్నని, నిజ నేస్తాన్నని తెలిసొచ్చింది

నా చుట్టూ నేనే
నాకూ ఆత్మీయులున్నారు
ఇక నేను ఓ బహువచనం