Thursday, October 27, 2011

ఏమి సెప్పను జాలరసోదరా, ఈ కడలిని నా ఆకలి తీరెరా!

కడలి నీరు కడతేరి మేఘాల దారి పట్టిందిరా
తెమ్మెర రాగానికి మేఘం చినుకుని కన్నదిరా!
కరిగినా కురిసినా ఆ నీట ఉప్పు లేనేలేదురా
వుంటే, ఈ సంద్రపు సేప సప్పగ వుండేదిరా!
ఏమి సెప్పను జాలరసోదరా, ఈ కడలిని నా ఆకలి తీరెరా!

Monday, October 3, 2011

వేగపయన పవనపల్లకి

మేఘతనయ చినుకుపిల్లకి
వేగపయన పవనపల్లకి
సూర్యజనన తూర్పురేఖకి
హరిధనువే  జోడువరుడు పెళ్ళికి

Friday, April 1, 2011

నిజంగా కలలాంటిదే జ్ఞాపకం

నిజమేనని అనలేనిది జ్ఞాపకం
నూకలవే అంటే నవ్వింది నిజం
నిజంగా కలలాంటిదే జ్ఞాపకం
నీ పరిచయం ఓ మరిచిన నిజం

ఒకసారి ఆగాలి తిరిగే కాలం
ఆ క్షణాన్ని మరల చూపాలి గతం
నా కన్నుల్లో నిండాలి నీ జ్ఞాపకం
ఆ క్షణమే అవ్వాలి ఓ జీవితం

Monday, March 7, 2011

జ్ఞాపకాలు బరువైతే విసిరెయ్ గతంలోకి

మౌనివైతే ఆగదులే అరక్షణం కాలచక్రం
ఒంటరివైనా సాగునులే కడదాకా బ్రతుకు నిత్యం
జ్ఞాపకాలు బరువైతే విసిరెయ్ గతంలోకి
స్నేహితులే కరువైతే తొంగిచూడు మనసులోకి

ఒక్క స్నేహితుడూ లేడా?
అయితే నీకు నువ్వే నేస్తానివి
ఆపై కావలి వుంది దైవానిది

అన్నీ కలలైతే -- ఒక బతుకన్నదే మాయమైతే

అన్నీ కలలైతే  పోలా  
అసలు మనసన్నదే  లేకపోతే పోలా
ఇక గురుతన్నదే కరువైతే పోలా
ఒక బతుకన్నదే మాయమైతే పోలా

Saturday, March 5, 2011

ఓ మరమనిషీ

ఆ చలి రాతిరిలో ఓ అరమనిషి
వణికే చలిలో తనకి చీకటే దుప్పటి
డొక్కలో కాళ్ళు పక్కనే కుక్కలు
అక్కరకు రాలేదు తను కన్నవారు

ఆ టీకొట్టు పక్కన
ఓ బక్కచిక్కిన ముసలమ్మ 
చేతిలో చిల్లర గలాసు
ఈగలు ముసిరినా తోలలేని వయసు

ఈ పెద్దమ్మగుడి ముందర
తల్లెవరో తెలియని పసికందు
స్నాన సంస్కారం లేక ఉప్పుచారాలు తేరిన దేహం
చిరిగిన  బట్టలు దుమ్మురాల్చే జుట్టు

యిన్ని చూసినా నాకు కన్నీరే రాదాయే
నా మనసుకు డబ్బు తెర అడ్డుపడిందా?
నా సంస్కారానికి చీకటి కమ్మిందా?
ఓ మరమనిషీ నువ్వు మనిషివేనని గుర్తుచేయ్యలా?

Thursday, February 24, 2011

న్యాయపు కౌగిలి గాలిగుప్పిలి

నేనుండగ  నా ప్రియుల సన్నిధి
న్యాయము చేయగ పరులకి
కాఖీలు చూపిరి నాకు నరకపు వాకిలి
ఆహా ఎంత శుభ దినమది!?

నా తనయకిది ఇరువది జన్మతిధి
తన పెండ్లిపందిరి వేయగ తలంచితి
ఏమి చేయగల?, నేనున్నది జైలుగది
ఆహా ఎంత శుభ దినమది!?

వరకట్నపు కాటుకు నా తనయ బలి ఆయెనను కబురుతో నిదుర లేచితి
రేపవలు శ్రమించి నా తనయను కాపాడ మనసార తలంచితి
ఏమి చేయగల?, నేనున్నది జైలుగది
ఆహా ఎంత శుభ దినమది!?

నా భార్యను మింగెను కరకు ఆకలి
తన గుప్పిలి నిండుగా కూడివ్వ తలంచితి
ఏమి చేయగల?, నేనున్నది జైలుగది
ఆహా ఎంత శుభ దినమది!?

నివు నిర్దోషివని నను పొమ్మని నిదుర లేపిరి
విడిపించబడితి గాని గమ్యమెరుగనైతి
విడిపించబడితి గాని ఎందుకు బ్రతకాలో యెరుగనైతి
విడిపించబడితి గాని యిన్నేండ్లు ఏల పట్టబడితినో ఎరుగనైతి
న్యాయానికి అర్ధం తెలియక అక్కడె నిలుచుంటి
నాకు దాని అర్ధము ఎవరు చెప్పగలరూ?
బహుశా నిఘంటువున దానిని సైతాను చొప్పించెనా?
లేక అసత్యసత్యమును దాయగ వారు దాని వాడిరా?
ఆహా ఎంత శుభ దినమది!?

న్యాయపు కౌగిలి గాలిగుప్పిలి
న్యాయం తోడుగా నేనొంటరి
నేడు కొడిగట్టిన జ్యోతుల దీపావళి!