Monday, March 7, 2011

జ్ఞాపకాలు బరువైతే విసిరెయ్ గతంలోకి

మౌనివైతే ఆగదులే అరక్షణం కాలచక్రం
ఒంటరివైనా సాగునులే కడదాకా బ్రతుకు నిత్యం
జ్ఞాపకాలు బరువైతే విసిరెయ్ గతంలోకి
స్నేహితులే కరువైతే తొంగిచూడు మనసులోకి

ఒక్క స్నేహితుడూ లేడా?
అయితే నీకు నువ్వే నేస్తానివి
ఆపై కావలి వుంది దైవానిది

అన్నీ కలలైతే -- ఒక బతుకన్నదే మాయమైతే

అన్నీ కలలైతే  పోలా  
అసలు మనసన్నదే  లేకపోతే పోలా
ఇక గురుతన్నదే కరువైతే పోలా
ఒక బతుకన్నదే మాయమైతే పోలా

Saturday, March 5, 2011

ఓ మరమనిషీ

ఆ చలి రాతిరిలో ఓ అరమనిషి
వణికే చలిలో తనకి చీకటే దుప్పటి
డొక్కలో కాళ్ళు పక్కనే కుక్కలు
అక్కరకు రాలేదు తను కన్నవారు

ఆ టీకొట్టు పక్కన
ఓ బక్కచిక్కిన ముసలమ్మ 
చేతిలో చిల్లర గలాసు
ఈగలు ముసిరినా తోలలేని వయసు

ఈ పెద్దమ్మగుడి ముందర
తల్లెవరో తెలియని పసికందు
స్నాన సంస్కారం లేక ఉప్పుచారాలు తేరిన దేహం
చిరిగిన  బట్టలు దుమ్మురాల్చే జుట్టు

యిన్ని చూసినా నాకు కన్నీరే రాదాయే
నా మనసుకు డబ్బు తెర అడ్డుపడిందా?
నా సంస్కారానికి చీకటి కమ్మిందా?
ఓ మరమనిషీ నువ్వు మనిషివేనని గుర్తుచేయ్యలా?